టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా తొందరగా సినిమాలు తీస్తుంటాడు. స్టార్ హీరో సినిమాను కూడా మూడు నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేయడం పూరికే చెల్లుతుంది. మేకింగ్ విషయంలో మరే దర్శకుడు పూరి స్పీడ్ ని అందుకోలేరు.

ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను మొదలుపెట్టినరోజే మేలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. పూరి స్పీడ్ గురించి తెలిసినవాళ్లు మేలో సినిమా వస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు పూరి కూడా స్లో అయిపోయాడనిపిస్తుంది. ఇప్పటికీ సినిమా షూటింగ్ దశలోనే ఉంది.

ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఈ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పూరి ఓ డేట్ చెప్పి రిలీజ్ చేయకపోవడం ఇదే మొదటిసారేమో .. కాకపోతే చిత్రబృందం ఆలోచన మరో విధంగా ఉంది. మేలో పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ సమయంలో రిలీజ్ చేయడం కంటే హడావిడి పూర్తయిన తరువాత రిలీజ్ చేయడం మంచిదని భావిస్తున్నారు.

పైగా ఈ సినిమాకు పూరి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.