టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చింది. కానీ చిత్రబృందం మాత్రం సినిమా హిట్ అంటూ ప్రమోట్ చేసుకుంది.

విజయ్ దేవరకొండ అభిమానులకు మాత్రం సినిమా బాగానే నచ్చింది. మొదటిరోజు వసూళ్లు బాగా రావడంతో కలెక్షన్ల పరంగా సినిమా నెట్టుకొస్తుందని భావించారు. కానీ అలా జరగడం లేదు. సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే డెఫిసిట్లు పడేటంతగాకలెక్షన్లు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా.. సినిమాలో కంటెంట్ కూడా చాలా ముఖ్యం. విజయ్ దేవరకొండ హీరో కావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ ఆరో రోజు కృష్ణాజిల్లాలో నలభై వేల డెఫిసిట్‌ వచ్చింది. అంటే థియేటర్ల రెంట్లకి సరిపడా డబ్బులు కూడా రాకపోగా.. వచ్చిన వసూళ్లలో నలభై వేలు ఎదురుకట్టాల్సిన పరిస్థితి. ఈ సినిమాను  జనాల్లోకి తీసుకువెళ్లడం కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు.

బహిరంగంగా స్టేజ్ పెర్ఫార్మన్స్ లు చేసి తనవంతు కృషి చేశాడు. సినిమాకు కనీసం ఏవరేజ్ టాక్ అయినా వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు బయ్యర్లు పెట్టిన పెట్టుబడిలో అరవై, డెబ్బై శాతం కూడా ఈ సినిమా రికవర్చేయలేకపోయింది. ఇకనైనా విజయ్ కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడేమో చూడాలి!