టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్ర హంగామా అప్పుడే మొదలైపోయింది. డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న విడుదల కానుండడంతో ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అందులోనే రష్మిక, విజయ్ మధ్య ముద్దు సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది. 

గీత గోవిందం చిత్రంలో విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డియర్ కామ్రేడ్ లో కూడా యువత కోరుకునే రొమాంటిక్ అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ లోని రెండవ పాటని మే 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్ కమ్మ ప్రకటించాడు. ఈ సంధర్భంగా విజయ్ దేవరకొండ గురించి భరత్ కమ్మ సరదాగా కొన్ని కామెంట్స్ చేశాడు. 

రెండవ పాట 'కదలాలిలే'ని  ఆదివారం రోజు విడుదల చేయాల్సింది. కానీ మే 15కు వాయిదా వేశారు. అందుకు గల కారణాన్ని భరత్ కమ్మ వివరించారు. ఈ సాంగ్ కోసం మీరంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుసు. ఆలస్యానికి కారణం విజయ్ దేవరకొండనే. ప్రతి క్లాస్ లో ఓ బ్యాడ్ స్టూడెంట్ ఉంటాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. అతడు మమ్మల్ని పని చేసుకోనివ్వట్లేదు. కానీ సాంగ్ ని పక్కాగా మే 15న విడుదల చేస్తాం అని తెలిపాడు. 

భరత్ కమ్మ ట్వీట్ కు విజయ్ దేవరకొండ స్పందించాడు. నా బర్త్ డే సంధర్భంగా బాగా క్రికెట్ ఆడాం. ఒళ్ళంతా నొప్పులు. అందుకే సాంగ్ వీడియో కటింగ్ పూర్తి కాలేదు. మే 15న మాత్రం సాంగ్ విడుదల కావడం పక్కా అంటూ విజయ్ అభిమానులకు తెలిపాడు. చిత్ర యూనిట్ విడుదల చేసిన కదలాలిలే సాంగ్ స్టిల్స్ రొమాంటిక్ గా ఉన్నాయి. ఈ పాటలో విజయ్, రష్మిక రొమాన్స్ హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.