సూపర్ స్టార్ రజిని కాంత్ నిన్న తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. రజిని కాంత్ తన పొలిటికల్ ఎంట్రీని కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో రజినికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిత్ర ప్రముఖులతో పాటు అభిమానులు రాజకీయంగా కూడా రజిని రాణించాలని కోరుకున్నారు. ఎప్పటి నుండో రజిని పొలిటికల్ ఎంట్రీ కోరుకుంటున్న ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ దీనిని ఆస్వాదిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజిని కాంత్ పోటీ చేయనున్నారు. 
 
త్వరలో ఆయన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించనుంది. రజిని కాంత్ కి సైకిల్ గుర్తు రానున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం రజనికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. సినిమాలలో వలె, రాజకీయాలలో కూడా తన బెస్ట్ స్టైల్ చూపించాలని కోరుకున్నారు. కాగా రజిని కూతురు ఐశ్వర్య రజిని కాంత్ పుట్టినరోజున నాడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విష్ చేశారు. ఓ వింటేజ్ కారు ప్రక్కన నిల్చొని ఉన్న రజిని కాంత్ ఫోటోని షేర్ చేసిన ఆమె 'రెడీ టు రూల్' అంటూ క్యాప్షన్ పెట్టారు. 
 
రజిని పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఈ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఇక సినిమాల పరంగా ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ విడుదల చేసిన రజిని, ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు శివతో అన్నాత్తే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.