గత కొన్ని రోజులుగా దాసరి నారాయణరావు కుమారుడు దాసరి ప్రభు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పోలీసులకు అతడి ఆచూకీ లభ్యమైంది. మంగళవారం దాసరి ప్రభు తన నివాసానికి చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట దాసరి ప్రభు తన మొదటి భార్య సుశీలపై సంచలన ఆరోపణలు చేశారు. 

దాసరి ప్రభు మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఎందరికో మానాన్న సాయపడ్డారు. అనేక సమస్యలని పరిష్కరించారు. కానీ సినీ పెద్దలు మాత్రం మా కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు అని ఆరోపించాడు. ఇక నాకు పోలీసులు మాత్రమే దిక్కు. వారే మా ఆస్తి తగాదాలని పరిష్కరించాలి అని కోరారు. 

తన మొదటి భార్య సుశీలతో ఉన్న సమస్యల పరిష్కారానికి చిత్తూరుకు వెళ్లానని దాసరి ప్రభు అన్నారు. కానీ ఆమె మాత్రం తనని వారం రోజుల పాటు చిత్తూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో తిప్పిందని తెలిపాడు. పోలీసులు ట్రాప్ చేస్తారనే ఇన్నిరోజులు పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పిందని దాసరి ప్రభు ఆరోపించారు. తన వద్ద భారీగా డబ్బు, ఆభరణాలు తీసుకుందని ప్రభు తెలిపారు.

తన సోదరుడితో ఉన్న ఆస్తి సమస్యలు కూడా ఇంకా తీరలేదని అన్నారు. ప్రస్తుతం తాను దిక్కు తోచని స్థితిలో ఉన్నానని, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలెవరైనా వచ్చి కుటుంబ సమస్యలు పరిష్కరించాలని కోరారు.