కేంద్ర మాజీ మంత్రి, చలనచిత్ర దర్శకులు దివంగత దాసరి నారాయణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. అక్కడ దాసరి విగ్రహం ఒకటి రూపుదిద్దుకుంటోంది. ఈనెల 26న దాసరి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో దాన్ని ఆవిష్కరిస్తారు. 

దాస‌రి ప్రియ శిష్యుడు ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, దాసరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఇక గతంలో దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో దాస‌రి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు… ‘డైరెక్ట‌ర్స్ డే’ అని ప్ర‌క‌టించి దాస‌రికి ఘ‌న నివాళి ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌సీమ‌. అయితే ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరుపైన‌, దాసరి విగ్ర‌హం విష‌యంలోనూ మోహ‌న్‌బాబు  కోప్పడ్డారు. 

అయితే  ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవర‌ణ‌లో ప్ర‌తిష్టించిన దాస‌రి విగ్ర‌హం మ‌ట్టితో త‌యారు చేసిన‌ది.  దాంతో ఆ విగ్రహం రంగు వెలిసిపోయింది.  ‘గురువు గారికి ఇచ్చే గౌర‌వం ఇదేనా’ అంటూ మోహ‌న్‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.ఈసారి అలా జరగకూడదని  విగ్రహాన్ని మోహన్ బాబు చెప్పిన ప్రకారం చేసినట్లు తెలుస్తోంది.