దగ్గుబాటి కుటుంబం నుండి మరో వారసుడి అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్(Abhiram) 'అహింస' మూవీతో హీరోగా మారుతున్నాడు. ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
మూవీ మొఘల్ రామానాయుడు మనవడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన మొదటి చిత్రం అహింస చిత్రీకరణ జరుపుకుంటుంది. సాధారణంగా డెబ్యూ హీరోలు లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఎంచుకుంటారు. అయితే అభిరామ్ ఓ భిన్నమైన సోషల్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ తోనే ఈ విషయం అర్థమవుతుంది. ఇక అహింస ప్రీ లుక్ పోస్టర్(Ahimsa prelook poster) నేడు విడుదల చేశారు. దర్శకుడు తేజ బర్త్ డే పురస్కరించుకుని అహింస చిత్ర అప్డేట్ ఇచ్చారు.
శరీరం నిండా గాయాలతో రక్తసిక్తం గా ఉన్న అభిరామ్ ముఖం గోనె సంచితో కవర్ చేసి ఉంది. మొత్తంగా అహింస ప్రీ లుక్ పోస్టర్ విభిన్నంగా ఉంది. అలాగే సినిమాపై ఆసక్తిరేకెత్తించింది. ఇక డెబ్యూ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రికార్డు తేజా (Teja)సొంతం. ఆయన లాంచ్ చేసిన ఉదయ్ కిరణ్, నితిన్ అరంగేట్రంతో అద్భుతాలు చేశారు. ఉదయ్ కిరణ్ ఫస్ట్ మూవీ చిత్రం, నితిన్ జయం చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. చిన్న చిత్రాలుగా విడుదలై భారీ విజయాలు నమోదు చేశాయి.
అయితే అవి యూత్ లవ్ ఎంటర్టైనెర్స్ కావడం విశేషం. కొన్నాళ్లుగా తేజా ఫార్మ్ కోల్పోయారు. అయినా నిర్మాత సురేష్ బాబు తన కుమారుడిని లాంచ్ చేసే బాధ్యత తేజాకి అప్పగించారు. సోషల్ సబ్జెక్టు తో తేజా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అహింస మూవీ చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
