సూపర్ స్టార్ అల్లుడిగా మాత్రమే కాకుండా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ధనుష్. అయితే గతేడాది మేలూరుకి చెందిన కదిరేశన్ అనే వ్యక్తి ధనుష్ తన కుమారుడంటూ కోర్టులో కేసు వేశాడు.

కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తన కుమారుడే అని చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయాడని అతడికోసం కోర్టులో పోరాడారు. హీరోగా మంచి స్థానంలో ఉన్న అతడు తమని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కేసులో భాగంగా ధనుష్ బర్త్ సర్టిఫికేట్ ని చూపించాలని కోర్టు ఆదేశించగా.. ధనుష్ వాటిని సమర్పించాడు.

దీంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఇప్పుడు కదిరేశన్ దంపతులు ధనుష్ చూపించిన సర్టిఫికేట్లు నకిలీ పత్రాలని, అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. తమకి న్యాయం జరిగేలా చూడమని మరోసారి కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఈ కేసుని స్వీకరించింది.

నవంబర్ 9న ఈ కేసు విచారణకి రానుంది. ధనుష్ కోర్టులో నకిలీ పత్రాలు సమర్పించి ఉంటే ఈ కేసు నుండి ఎలా బయటపడతాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధనుష్ తల్లితండ్రుల విషయంలో క్లారిటీ లేకపోవడం అభిమానులను భయాందోళనకి గురి చేస్తోంది!