మెగా డాటర్ నీహారిక వివాహం గత వారంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ స్టార్ హోటల్ లో అత్యంత వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ వివాహానికి కొణిదెల ఫ్యామిలీ మొత్తం హాజరై ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఇక ఈ పెళ్లి జరిగిన మూడు రోజులూ నీహారిక తల్లి, నాగబాబు భార్య పద్మజ జ్వరంతోనే ఉన్నారట.  పెళ్లికి ముందే తనకు జ్వరం మొదలైందని, తన భర్త, కుమారుడు వరుణ్ తేజ్ దగ్గరుండి తనను చూసుకున్నారని చెప్పి  ఎమోషన్ అయ్యారు.

పద్మజ మాట్లాడుతూ... మా చిన్న బిడ్డ నీహారిక వివాహం జరిగిపోయిందంటే నమ్మలేకపోతున్నానని, అందరి మాదిరిగానే తాను కూడా కూతురి పెళ్లిని ఘనంగా చేయాలని అనుకున్నానని, అంతా సవ్యంగానే జరిగిందని తెలిపారు. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి తనకు తీవ్రమైన జ్వరం ఉందని, అయితే, భర్త, వరుణ్ తనను ఎంతో బాగా చూసుకుంటూ పెళ్లి పనుల భారం పడనీయకుండా చేశారని చెప్పారు. నీహారిక కూడా పెళ్లి తరువాత గతంలో ఎన్నడూ లేనంతాసంతోషంగా ఉందని అన్నారు.

వీరిద్దరినీ చూస్తుంటే పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయం అవుతాయన్న సంగతి మరోసారి నిరూపితం అయిందని, ఒకరికి ఒకరు అన్నట్టుగా ఇద్దరూ ఉన్నారని చెప్పిన పద్మజ, ఇరువురి అభిరుచులు, ఆలోచనా ఒకటేనని అన్నారు. తన కుమార్తెకు ఆదర్శవంతుడైన జీవిత భాగస్వామి దొరికాడని, అందుకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. నీహారికను పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో తన నిశ్చితార్థపు చీర కట్టుకోవడంతో తనకు, తన భర్తకు కన్నీరు ఆగలేదని చెప్పారు. అవి తన జీవితంలో అత్యంత భావోద్వేగ భరిత క్షణాలని, అవే అపురూపమని అన్నారు.