ప్రభుదేవా మరలా తండ్రి అయ్యాడనే న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. భార్య హిమానీ సింగ్ పాపకు జన్మనిచ్చారట.  

హీరో ప్రభుదేవా యాభై ఏళ్ళ వయసులో తండ్రి అయ్యారనే వార్త ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రభుదేవా మొదటి భార్య రామలతకు 2011లో విడాకులు ఇచ్చారు. వీరికి ముగ్గురు సంతానం కాగా పెద్దబ్బాయి క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. నయనతారతో సహజీవనం చేసిన ప్రభుదేవా భార్య నుండి విడాకులు కోరుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద రాద్ధాంతం అయ్యింది. రామలత విడాకులు వద్దంటూ కోర్టును ఆశ్రయించారు. అలాగే నయనతారతో ప్రభుదేవా బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 

అయితే ప్రభుదేవా-రామలత విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల అనంతరం నయనతారతో ప్రభుదేవా రిలేషన్ కొనసాగింది. త్వరలో పెళ్లి అనగా అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. వీరి మధ్య విబేధాలకు కారణాలు తెలియలేదు. కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న ప్రభుదేవా 2020లో డాక్టర్ హిమానీ సింగ్ ని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 

ప్రభుదేవా రెండో భార్య గురించి తెలిసింది చాలా తక్కువ. ప్రభుదేవా 50వ బర్త్ డేను హిమానీ సింగ్ ప్రత్యేకంగా జరిపారు. వీడియో రూపొందించారు. భార్య ప్రేమకు ప్రభుదేవా మురిసిపోయారు. అప్పుడు హిమానీ సింగ్ వెలుగులోకి వచ్చింది. కాగా హిమానీ సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారట. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.