సల్మాన్ హీరోయిన్‌కి కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ..
సల్మాన్ ఖాన్‌తో కలిసి `వీర్` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జరీనా ఖాన్ కోర్ట్ కేసులో ఇరుక్కుంది. తాజాగా ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

సల్మాన్ ఖాన్ హీరోయిన్ జరీనా ఖాన్ కోర్ట్ కేసులో ఇరుక్కుంది. ఏకంగా ఆమెపై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కోల్ కత్తా కోర్ట్ నటి జరీనా ఖాన్ అరెస్ట్ కి వారెంట్‌ని జారీ చేసింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. జరీనా ఖాన్‌పై 2016లో ఛీటింగ్ కేసు నమోదైంది.
దీనికి సంబంధించిన విచారణ చాలా రోజులుగా జరుగుతుంది. తాజాగా ఇన్వెస్టింగ్ ఆఫీసర్ నటికి వ్యతిరేకంగా కోర్ట్ లో ఛార్జీ షీట్ దాఖలు చేశారు. దీంతో కోల్‌కత్తాలోని షీల్దా కోర్ట్ ఆదివారం జరీనా ఖాన్‌కి అరెస్ట్ వారెంట్‌తో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఛీటింగ్ కేసుకు సంబంధించిన ఈ బ్యూటీ బెయిల్ తీసుకోలేదు. కనీసం కోర్ట్ ముందు కూడా హాజరు కాలేదు. చాలా రోజులుగా కోర్ట్ ని తప్పించుకుని తిరుగుతుంది. దీంతో నటి వ్యవహార తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్ట్.. చార్జీ షీట్‌ని దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ వారెంట్‌ని జారీ చేసింది. పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అరెస్ట్ వారెంట్‌పై నటి స్పందించింది. తనకు దీనిపై క్లారిటీ లేదని, ఇందులో నిజం లేదని తాను నమ్ముతున్నట్టు తెలిపింది. తాను ఈ వార్తలు విని ఆశ్చర్యపోతున్నానని, దీనిపై తన లాయర్‌తో చెక్ చేస్తానని, అప్పుడే క్లారిటీ ఇవ్వగలనని చెప్పింది. ఆ తర్వాత తన పీఆర్‌తో దీనికి సంబంధించిన సమాచారం అందిస్తామని వెల్లడించింది.
కాగా 2016లో కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజా కార్యక్రమంలో జరీన్ ఖాన్ పాల్గొనాల్సి ఉంది. అందులో ఆమె ప్రదర్శన ఇవ్వాల్సింది. కానీ ఆమె హాజరు కాలేదు. దీంతో తాను ఈవెంట్‌కి వస్తారని రాకుండా మోసం చేసిందని ఈవెంట్ నిర్వహకులు జరీన్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరీన్ ఖాన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కోర్ట్ లో జరుగుతుంది.
దీనిపై అప్పట్లో జరీన్ ఖాన్ స్పందిస్తూ, ఆ పూజా కార్యక్రమానికి బెంగాల్ సీఎంతోపాటు మంత్రులు కూడా భారీగా పాల్గొంటారని తనకు చెప్పారని, కానీ వారెవరూ హాజరు కాలేదని, అలా తనని నిర్వహకులు తప్పుదారి పట్టించారని ఆమె ఆరోపించారు. అది ఉత్తర కోల్‌కత్తాలోని చిన్న ఈవెంట్‌గా తన టీమ్ ద్వారా తెలుసుకున్న జరీన్.. ఆ తర్వాత తన ఫ్లైట్ టికెట్లు, ఇతర వసతి విషయంలో తప్పుగా మాట్లాడారని, దీంతో ఆ షో నుంచి తాను తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. దీంతో నిర్వహకులు జరీన్ ఖాన్, ఆమె మెనేజర్‌పై కేసు పెట్టారు. అప్పట్నుంచి ఈ కేసు స్థానిక కోర్ట్ లో కొనసాగుతుంది. తాజాగా ఇన్నాళ్లకి ఆమెకి కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం గమనార్హం.
అన్నట్టు జరీనా ఖాన్.. సల్మాన్ ఖాన్‌తో `వీర్` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సల్లూభాయ్‌తోనే `రెడీ` చిత్రంలో నటించింది విజయాన్ని అందుకుంది. కొన్నాళ్లపాటు బిజీగా రాణించిన ఈ బ్యూటీకి గత రెండేళ్లుగా సినిమాలు లేవు.