ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్లను బెల్లంకొండ తిరిగి ఇవ్వడం లేదని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కోర్టుని ఆశ్రయించగా.. ఈ మేరకు బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే.. 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన 'బాండ్ బాజా బరాత్' సినిమా అక్కడ పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఆధారంగా 2013లో బెల్లంకొండ సురేష్.. సిద్ధార్థ్, సమంత జంటగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో దాదాపు 19 సీన్లను 'బాండ్ బాజా బరాత్' నుండి కాపీ చేశారని ఆరోపిస్తూ యష్ రాజ్ ఫిలిమ్స్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో కోర్టు 'జబర్దస్త్' సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.

అయితే జబర్దస్త్ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలికాస్ట్ రైట్స్ ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కి విక్రయించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ కంప్లైంట్ మేరకు సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో పాటు టీవీలోనూ టెలికాస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది.

ఈ మేరకు సదరు టీవీ ఛానెల్ కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్ తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆరేళ్లుగా ఆయన కాలయాపన చేస్తుండడంతో ఛానెల్ యాజమాన్యం కోర్టుని ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న మూడున్నర కోట్లు మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. దీంతో కోర్టు బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీన్ని బెల్లంకొండ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి!