సారాంశం

టీవీ నటి అప్సర  మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది. అప్సరను చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  పూజారికి జీవిత ఖైదు విధించింది. 


సరూర్‌నగర్‌‌ లో జరిగిన బుల్లితెర నటి అప్సర మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువతిని అత్యంత దారుణంగా చంపిన ప్రధాన నిందితుడు పూజారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు కాను అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అప్సర కుటుంబానికి 10 లక్షల  చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.దోషి అయ్యగారి వెంకట సాయి కృష్ణ కురుగంటి అప్సరను చంపి  ఆమె మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడవేసి, ఆపై ఎర్రమట్టి, సిమెంట్‌తో మూసివేశారు.

ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహం కోసం అప్సర ఒత్తిడి చేయడంతోనే సాయి కృష్ణ ఆమెను చంపాడని దర్యాప్తులో తేలింది. "పూజారికి ఇప్పటికే భార్య ఉన్నప్పటికీ, బాధితురాలిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. . పోలీసుల ప్రకారం, 2023 నుంచి ఇద్దరి మధ్య స్నేహం, ఆతరువాత అది  ప్రేమగా మారింది.  తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసి... నటనవైపు అడుగులు వేసింది. కొన్ని  తమిళ సినిమాల్లో నటించిన అప్సర బుల్లితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.   2022 లో అవకాశాల కోసం  హైదరాబాద్‌కు వచ్చింది. తల్లితో కలిసి సరూర్‌నగర్‌ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. 

దైవభక్తి కలిగిన అప్సర తన తల్లితో కలిసి రోజు గుడికి వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే తన తల్లికి బాగా పరిచయం అయిన  పూజారి సాయికృష్ణతో.. అప్సరకు స్నేహం పెరిగింది. అదికాస్త ఆతరువాత  ప్రేమగా మారింది.అప్పటికే పెళ్లైన పూజారి సాయికృష్ణ  అప్సరతో నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో నాలుగుసార్లు చంపడానికి ప్లాన్ చేశాడు. కాని ప్రతీ సారి విఫలం అయ్యాడు. 

చివరికి 2023, జూన్‌లో శంషాబాద్ ప్రాంతంలో అప్సరను మర్డర్ చేసి.. తన కారులో ఇంటికి తీసుకువచ్చాడు. రెండు రోజులు అప్సర మృతదేహాన్ని కారులోనే ఉంచి.. సరూర్‌నగర్‌లోని మైసమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయం  మ్యాన్‌హోల్‌లో  పడేశాడు. వాసన వస్తున్నట్టు గమనించి రెండు ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసేశాడు.

ఆతరువాత ఏం తెలియనట్టు అప్సర తల్లితో కలిసి పోలీస్టేషన్ లో కంప్లైయింట్ ఇచ్చాడు సాయికృష్ణ.  అయితే పోలీసులు రంగంలోకి దిగి.. మొత్తం వ్యావహారంపై విచారణ జరపగా.. విషయం మొత్తం  వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో సాయి కృష్ణను అరెస్ట్ చేసి..  కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈక్రమంలో అతనికి జీవిత ఖైదు విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది.