కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ వైరస్‌ కారణంగా అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ముఖ్యంగా వినోద పరిశ్రమ తిరిగి ఇప్పడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో చిన్న స్థాయిలో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకొని కెరీర్‌ పరంగా సెటిల్‌ అవుతామని భావించిన వారు, ఇండస్ట్రీ కార్యకలాపాలు ఆగిపోవటంతో పనిలేక అప్పుల పాలవుతున్నారు.

తాజాగా అలాంటి పరిస్థితే ఓ యువ నటుడికి ఎదురైంది. హిందీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న శార్దుల్‌ కునాల్ పండిట్‌, లాక్‌ డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బాందిని, కుల్దీపక్‌, సిద్ధి వినాయక్‌ లాంటి షోస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్‌. అయితే లాక్ డౌన్‌ కారణంగా అన్ని షోస్ ఆగిపోవటంతో కునాల్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

మూడు నెలలుగా పని లేకపోవటంతో తన సేవింగ్స్‌ కూడా పూర్తిగా అయిపోయాయి. దీంతో ఇక ముంబైలో జీవనం సాగించలేని పరిస్థితిలో తన స్వస్థలం ఇండోర్‌కు వెళ్లిపోయాడు కునాల్‌. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేసిన కునాల్‌, అవకాశాలు ఇవ్వాల్సిందిగా వేడుకున్నాడు. నాకు పెద్ద పెద్ద ఏజెన్సీలతో సంబంధాలు లేవు. అందుకే నేను అవకాశాల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నించలేను. నాకు ఉన్న అవకాశం ఇదొక్కటే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కునాల్‌.

ఇటీవల టైమ్స్‌ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి ఇలా మారటానికి కారణాలు వెల్లడించాడు శార్దుల్‌. లాక్‌ డౌన్‌ ముందుకు వరకు తాను చేస్తున్న షోకు సంబంధించిన పేమెంట్‌ రావాల్సి ఉంది. అదే సమయంలో ఓ వెబ్ సిరీస్‌ కోసం తనను సంప్రదించారు. ఈలోగా లాక్‌ డౌన్‌ రావటంతో ఆ ప్రాజెక్ట్‌ కూడా ఆగిపోయింది. నటన మీద ఇష్టంతో యూఏఈలో ఉద్యోగం వదులుకొని మరీ వచ్చిన శార్దుల్ ఇప్పుడు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.