క్రాక్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ తనలో ఇంకా పదును తగ్గలేదని నిరూపించాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ రికార్డు వసూళ్లు రాబట్టింది. మాస్ పోలీస్ అధికారిగా రవితేజ వెండితెరపై క్రాకర్ లా పేలాడు. క్రాక్ మూవీ ఇచ్చిన కిక్ తో కొత్త చిత్రం ఖిలాడిని చకచకా పూర్తి చేస్తున్నాడు. 


అయితే రవితేజ స్పీడ్‌కు కరోనా వైరస్ బ్రేక్ వేసింది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి చిత్ర షూటింగ్ ఆగిపోయింది.  కొద్దిరోజుల క్రితం ఖిలాడి షూటింగ్‌ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఇటలీ షెడ్యూల్‌ దాదాపు పూర్తయ్యే తరుణంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్‌ తగిలింది.ఇటలీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ఖిలాడి సినిమా షూటింగ్‌కు అనుమతులను నిలిపివేసిందట. దాంతో చిత్రబృందం అయోమయంలో పడిందని సమాచారం.


ఊహించని ఈ పరిణామానికి చిత్ర బృందానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదట. షూటింగ్ ఇటలీలోనే పూర్తి చేయాలా లేక, మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలా అనే ఆలోచనలో పడ్డారట. మే 28 విడుదల తేదీగా ప్రకటించగా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విడుదల ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖిలాడి మూవీలో డింపుల్‌ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.