లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవటంతో దాదాపు మూడు నెలలుగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తుండటంతో సెలబ్రిటీలు బయటకు వస్తున్నారు. అయితే ఈ సమయంలో కొంత మంది లాక్ డౌన్‌ నింబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కంగనా రనౌత్ ఫ్యామిలీతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లటంపై విమర్శలు వినిపించాయి.

తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ విషయంలో కూడా వివాదం మొదలైంది. ఆయన లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇటీవల అక్షయ్‌ కుమార్  ముంబై నుంచి నాసిక్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించారు. దీనికి సంబంధించి ఆయన అనుమతులు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి చగన్‌ భుజ్‌బల్‌ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. `అక్షయ్‌ నాసిక్ పర్యటన గురించి న్యూస్‌లో చూసి తెలుసుకున్నాం. ఆయన ప్రయాణం గురించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయంపై విచారణ జరిపిస్తాం` అంటూ చెప్పారు. అయితే అక్షయ్‌ కుమార్‌ ఓ డాక్టర్‌ను కలిసేందుకు నాసిక్‌ వెళ్లారన్న టాక్‌ వినిపిస్తోంది.