దాదాపు మూడు దశాబ్దాల పాటు స్టార్ కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలాడు బ్రహ్మానందం. ఒకానొక సమయంలో ఆయన లేని తెలుగు సినిమా రాలేదంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి కమెడియన్ సడెన్ గా డౌన్ అయిపోయారు. ఏ సినిమా చేసినా అందులో బ్రహ్మీ కామెడీ పండక జనాలు పెదవి విరిచారు. 

దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య బ్రహ్మీ ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. రెండు, మూడేళ్లుగా బ్రహ్మీ ఊసే లేకుండా పోయింది. ఒకప్పుడు ఆయన లేకుండా సినిమానే ఉంది కాదు కానీ ఇప్పుడు ఆయన ఎవరికీ గుర్తు కూడా రావడం లేదు. 

పైగా వెన్నెల కిషోర్ లాంటి యంగ్ కమెడియన్ల హవా పెరగడంతో దర్శకనిర్మాతలు కూడా బ్రహ్మీని పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఆయనకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన 'వాల్మీకి'లో బ్రహ్మీకి ఓ రోల్ ఇచ్చాడు.

కథలో ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. గతంలో హరీష్ ఆయన రూపొందించిన 'గబ్బర్ సింగ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి సినిమాల్లో బ్రహ్మీకి మంచి క్యారెక్టర్లు ఇచ్చి కామెడీ పండించారు. ఇప్పుడు మరోసారి తన సినిమాలో బ్రహ్మీకి ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా అయినా బ్రహ్మీ కెరీర్ కు ఊపు తెస్తుందేమో చూడాలి!