ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. వేణు మాధవ్ నేడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు చికిత్స జరుగుతోంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధింత సమస్యలతో వేణు మాధవ్ బాధపడుతున్నారు. 

వేణు మాధవ్ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి చాలా రోజుల క్రితమే అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో వేణుమాధవ్ బాగానే ఉన్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలని అప్పట్లో ఖండించారు. 

గత కొంతకాలంగా వేణు మాధవ్ కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో భాదపడుతున్నారు. ఆ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వేణుమాధవ్ కండిషన్ క్రిటికల్ గా ఉందని ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం. 

వేణుమాధవ్ సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులంతా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయం, గోకులంలో సీత చిత్రాలతో వేణుమాధవ్ సినీ కెరీర్ ప్రారంభమైంది. వేణుమాధవ్ ఎన్నో చిత్రాల్లో నటించారు. తమ్ముడు, ఆది, దిల్, లక్ష్మీ, సింహాద్రి, వెంకీ లాంటి చిత్రాల్లో వేణుమాధవ్ అద్భుతమైన హాస్యం పండించారు.