హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు, నటుడు జగదీశ్వరన్‌(55) కన్నుమూశారు. 

ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు, నటుడు జగదీశ్వరన్‌(55) కన్నుమూశారు. గత కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న జగదీశ్వరన్‌ ఆదివారం కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని మధురైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో ఆరోగ్యం విషమించి ఆయన మృతి చెందారు.

వడివేలు కమెడియన్‌గా ఎంతటి పాపులరో తెలిసిందే. స్టార్‌ కమెడియన్‌గా, కోలీవుడ్‌ని ఊపేశాడు. అయితే తన తమ్ముడు జగదీశ్వరన్‌ కూడా నటుడే. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. శింబు హీరోగా వచ్చిన `కాదల్‌ అలైవిట్టలై` సినిమాతో సహా పలు చిత్రాల్లో నటించారు. కానీ జగదీశ్వరన్‌ నటుడిగా సెట్‌ కాలేదు. సినిమా ఛాన్స్ లు రాలేదు. దీంతో కొన్నాళ్లకే ఆయన సినిమా పరిశ్రమని వదిలేశారు. సొంత ఇంటి(మధురై)కి వెళ్లిపోయారు. అక్కడ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. 

లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. దీంతో వడివేలు ఇంట విషాదం అలుముకుంది. ఇటీవలే వడివేలు తల్లి కన్నుమూశారు. దాన్నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు తమ్ముడు చనిపోవడం అత్యంత బాధాకరం. ఇక వడివేలు ఇటీవల సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య `మామన్నన్‌`లో ఎమ్మెల్యేగా పూర్తి భిన్నమైన పాత్ర పోషించారు. సీరియస్‌ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు `చంద్రముఖి2`తో రాబోతున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటించగా, కంగనా చంద్రముఖిగా కనిపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది.