సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలు అవ్వడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే హీరోలుగా మారిన వారిలో విజయాలు అందుకున్న వారు మాత్రం చాలా అరుదు. హీరో సునీల్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. మొదట్లో ఒకట్రెండు సక్సెస్ లు అందుకున్నా.. తర్వాతర్వాత డీలా పడిపోయాడు. దీంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక కమెడియన్ సప్తగిరి హీరోగా రెండు సినిమాలు చేశాడు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే హీరోగా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు సప్తగిరి. తనలో హీరోయిజం అనుకున్న రేంజ్ లో ఎలివేట్ అవ్వలేదు. దీంతో తిరిగి మళ్ళీ కామెడీ వేషాలు వేసుకుంటే మంచిందని కొందరు సూచించారు. కానీ ఈ కమెడియన్ కమ్ హీరో ఆలోచనలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.

బొమ్మరిల్లు సినిమా మొదలు సప్తగిరి చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ అనుభవంతోనే దర్శకుడిగా మారి సినిమాలు చేయాలనుకుంటున్నాడు. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. ఇది మాత్రం నిజమని అంటున్నారు. అతడికున్న పరిచయాలతో అవలీలగా కాంబినేషన్స్ సెట్ చేసుకొని సినిమా చేసేయొచ్చు. కానీ ఈ టైమ్ లో సప్తగిరి ఇదంతా అవసరమా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం మానేసి రిస్క్ పనులు చేస్తున్నాడని అంటున్నారు. హీరోగా ఎలాగో విజయం సాధించలేకపోయాడు. మరి దర్శకుడిగా అయినా రాణిస్తాడా..?