పవన్ కళ్యాణ్, అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. దీంతో పవన్ జనసేన పార్టీ పెట్టిన వెంటనే అలీ ఆ పార్టీలో చేరతాడని అంతా అనుకున్నారు. కానీ అలీ మాత్రం ఓ పక్కన టీడీపీ, మరో పక్క వైసీపీ పార్టీల చుట్టూ తిరుగుతూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ అడిగితేనే పార్టీలోకి వెళ్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా అలీ.. పవన్ నా పార్టీలోకి రా అని ఎప్పుడూ పిలవలేదని అన్నారు. ఆయన పార్టీ పెడుతున్న విషయం తనకు ముందే తెలుసునని, కానీ పవన్ ఎప్పుడూ ఆ విషయాలను డిస్కస్ చేయలేదని అన్నారు.

పవన్ పార్టీ స్థాపించిన తరువాత ఆయన దగ్గరకి వెళ్లలేదని, ఆయన కూడా తనను పిలవలేదని అలీ క్లారిటీ ఇచ్చాడు. పవన్ తన సొంత వాళ్లు ఇబ్బంది పడితే చూడలేరని, ఆ కారణంగానే తనను పిలిచి ఉండరని అలీ అన్నాడు. 

పవన్ ఓ వైపు జగన్, చంద్రబాబులతో పోరాటం చేస్తుంటే మీరు ఆ పార్టీలో కలవడం ఏంటనే ప్రశ్నకు సమాధానంగా అలీ.. నేను టీడీపీ మనిషినని పవన్ కి తెలుసునన్నారు. అప్పుడప్పుడు ఆయన కూడా ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ వస్తుందా అని అడిగేవారని అలీ గుర్తు చేసుకున్నారు. 

అయినా స్నేహం వేరు, పార్టీ వేరని చెప్పిన అలీ తనకు ఏ పార్టీ మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని క్లారిటీ ఇచ్చాడు.