ఇప్పటికే  కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో వచ్చిన పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ, నాని హీరోగా వచ్చిన 'v' చిత్రాలు  మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. త్వరలోనే హీరో సూర్య 'ఆకాశం నీ హద్దురా' కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో మరిన్ని సినిమాలు ఇదే బాట పడుతున్నాయి. తాజాగా సుహాస్ హీరోగా వస్తున్న''కలర్ ఫోటో'' చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. 

ఇప్పటికే అనేక సినిమాల్లో హాస్యనటుడుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు.. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి ఛాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తున్నాడు.. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'హృదయ కాలేయం' సాయి రాజేష్ నిర్మించారు.

ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మంచి రేటుకు అల్లు అరవింద్  తన  ఓటీటీ ‘ఆహా’  కోసం రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీపావళి కానుకగా నవంబరు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఈ మేరకు ఓ టీజర్ వదిలారు.  టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మంచి లాభానికే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడయ్యాయట. అలాగే శాటిలైట్‌తో పాటు డబ్బింగ్ రైట్స్ నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. సినిమా రిలీజై హిట్టైతే...రీమేక్ రైట్స్ కోసం కూడా డిమాండ్ ఉండొచ్చు. మొత్తానికి ఒక మంచి టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగితే సినిమా బిజినెస్ ఈజీగా జరుగుతుందని ‘కలర్ ఫోటో’ తాజాగా మరోసారి రుజువు చేసింది.