ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని సామాన్యులతో పాటు ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 

రామోజీరావు: 
బాలు మరణం మాటలకందని విషాదమన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావ్. ఎస్పీబీ ఇక లేరంటేనే బాధగా, దిగులుగా ఉందని.. మనసు మెలిపెట్టినట్లుగా ఉందన్నారు. ఆయన గంధర్వ గాయకుడే కాదని.. తనకు అత్యంత ఆత్మీయుడని, ప్రేమగా పలకరించే తమ్ముడని రామోజీరావు గుర్తుచేసుకున్నారు.

బాలసుబ్రమణ్యం తెలుగు జాతికే కాదు ప్రపంచ సంగీతానికే ఓ వరమని ఆయన అభివర్ణించారు. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల పాటలు తేట తీయని తేనెల ఊటన్నారు. 

కేసీఆర్:

ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలసుబ్రమణ్యం.. భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాలు అని చంద్రశేఖర్ రావు కొనియాడారు. బాల సుబ్రమణ్యం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

వైఎస్ జగన్:

బాల సుబ్రమణ్యం  ఐదు దశాబ్దాలుగా అద్భుతమైన సినీ సంగీతాన్ని సామాన్య ప్రజలకు అందజేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. 16 భాషల్లో 40 వేల పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో బాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జగన్ చెప్పారు. దేశం ఓ మేరునగధీరున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాల సుబ్రమణ్యం కుటుంబసభ్యులకు ఏపీ సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అమిత్ షా:

బాలసుబ్రమణ్యం శ్రావ్యమైన స్వరం, అసమానమైన సంగీత కూర్పుల ద్వారా మన జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి . 

 

 

 

రాహుల్ గాంధీ: 

బాలసుబ్రమణ్యం పాడిన పాటలు కోట్లాది మంది హృదయాలను తాకాయి. మన మనస్సులో ఆయన స్వరం వినిపిస్తుంది. బాలు కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. 

 

 

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్:

భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయింది. భారతీయ సంగీత ప్రియులకు బాలసుబ్రమణ్యం మరణం తీరనిలోటు. గాన చంద్రుడిగా  పిలుచుకునే బాలు పద్మభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు.  ఆ గానగంధర్వుడి కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి

 

 

 

హరీశ్ రావు:

గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

 

 

 

కల్వకుంట్ల కవిత:

బాలు అసాధారణ కళాకారుడు. ఆయన మరణం మనందరికీ తీరనిలోటు. బాల సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 


 

 

 

చంద్రబాబు నాయుడు : 

కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.