వచ్చే సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 సున్నితమైన అంశంపై మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. రాజకీయ నేపథ్యమున్న చిరంజీవిని తిరిగి ఆదరిస్తారా..
చిరంజీవి 150వ సినిమా దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా. అందుకు తగ్గట్టుగానే బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ పెట్టి ఈ మూవీ టైటిల్ డిసైడ్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్రణాళికతో దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులో మరిన్ని అదనపు హంగులతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు నేటివిటీ, బ్యాగ్రౌండ్ కు తగ్గట్టుగా మూవీ రూపొందించేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ చిత్రానికి.. పవర్ ఫుల్ డైలాగ్స్, అంతే ఎఫెక్టివ్ స్టోరీ అవసరం కావటంతో... కథపరంగా మరిన్ని హంగులు అద్దేందుకు, పవర్ ఫుల్ స్టోరీ నరేషన్ ఉండేందుకు సినిమా కథపై పరుచూరి బ్రదర్స్ పని చేస్తున్నారు.
చిరు సినిమా కోసం టీం ఇంతలా ఎఫర్ట్ పెడుతున్నా... ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో.. ఈ మూవీని ప్రేక్షకులు ఎంత మేరకు ఆదరిస్తారోననే సందేహం మాత్రం ఎక్కడో తొలుస్తూనే ఉంది. ఎందుకంటే మెగా స్టార్ చిరుకు సినిమాల్లో దాదాపు తొమ్మిదేళ్ల విరామం.. అదే సమయంలో రాజకీయాల్లో చిరు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం..సినిమాపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో విజయ్ హీరోగా చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే విజయ్ ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నవాడు కాకపోవడం,తనకున్న ఫ్రెష్ ఇమేజ్ తోనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. కానీ చిరు 150వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరు ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్ లో చేరి యూపీఏలో కేంద్ర మంత్రిగా పనిచేయడం.. కాంగ్రెస్ హయంలో రైతు ఆత్మహత్యలు పెరగడం.. ఇవన్నీ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు రైతుల నుంచి భూమిని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సర్కార్ పై ఎలాంటి డైలాగులతో విమర్శలు చేస్తారోనని టాక్ నడుస్తోంది.
రాజకీయాలు వేరు, సినిమాలు వేరైనా... మెగాస్టార్ పదేళ్ల తర్వాత తిరిగి వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు ఉన్నాయి. మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఖైదీ నంబర్ 150 ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాస్టింగ్, స్పెషల్ సాంగ్ లాంటి అన్ని హంగులనూ పక్కాగా జోడిస్తున్నారు. మెగాస్టార్ మూవీ కావడం, అందునా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం వల్ల ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు. అయితే రిలీజయ్యాక ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది దృష్టిలో పెట్టుకుని ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం దర్శకుడు వినాయక్ చేతుల్లో ఉంది.
