కరోనాతో ఏర్పడ్డ లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కూడా  అనుమతివ్వడంతో ఇప్పటికే థియేటర్లు ఓపెన్‌ చేశారు. పాత సినిమాలను, ఇంగ్లీష్‌ సినిమాలను వేస్తూ రన్‌ చేస్తున్నారు. కానీ ఇప్పుడు క్రిస్మస్‌ కానుకగా ఫస్ట్ టైమ్‌ ఓ పెద్ద సినిమా విడుదలకాబోతుంది. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది `సోలో బతుకే సో బెటర్‌`. సాయితేజ్‌ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఈ చిత్రానికి, సాయితేజ్‌కి మెగాస్టార్‌ చిరంజీవి విషెస్‌ తెలియజేశారు. `ఈ క్రిస్మస్‌కి విడుదలవుతున్న `సోలో బతుకే సో బెటర్‌` టీమ్‌కి నా శుభాకాంక్షలు. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే ముఖ్యమైన సందర్భం. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్‌ మాస్క్ లు ధరించి సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ ఈ  సినిమాని థియేటర్లో ఎంజాయ్‌ చేయాల్సిందిగా కోరుతున్నా` అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమాకి దక్కే ఆదరణ బట్టే నెక్ట్స్ సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. 

ఇదిలా ఉంటే నేడు(బుధవారం) ఆది సాయికుమార్‌ పుట్టిన రోజు. ఈ సంద్భంగా ఆయన హీరోగా నటిస్తున్న `శశి` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు, చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ తెలియజేశారు. టీజర్‌ని అభినందించారు.