Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

సినిమా సంక్షేమం కోసం, మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Chiranjeevi thanks CM Jagan for the relief package jsp
Author
Hyderabad, First Published Apr 7, 2021, 7:50 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు తాజాగా రాయితీలు ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అనుబంధ సంస్థలకు వరాలు కురిపించారు. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటించటంతో టాలీవుడ్ అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రత్యేక రాయితీలతో థియేటర్ యాజమాన్యాలకు అండగా నిలిచింది.విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఆ రాయితీలు ఏమిటీ అంటే... 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తదుపరి 6 నెలల (జులై 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు) కాలానికి థియేటర్లు,మల్టీప్లెక్సులు చెల్లించాల్సిన విద్యుత్ స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. థియేటర్ యాజమాన్యాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు మల్టీప్లెక్సులకు ఇవ్వలేదు. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ది చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

ఈ నేపధ్యంలో  ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 'మీరు తీసుకున్న చర్యలు చిత్రపరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు మేలు చేస్తాయి...' అని అభిప్రాయపడ్డారు. అలాగే దిల్ రాజు సైతం తన ఆనందాన్ని తన బ్యానర్ ట్విట్టర్ వేదికగా తెలియచేసారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios