యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరు తన స్పీచ్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. మెగాభిమానులకు, రౌడీ అభిమానులకు నా నమస్కారాలు అంటూ మొదలుపెట్టిన చిరు 'గీత గోవిందం' సినిమా తనను ఆకట్టుకుందని చెప్పారు.

అందుకే సినిమా సక్సెస్ మీట్ కి వచ్చినట్లు చెప్పారు. మరింత మాట్లాడుతూ.. ''ఈ రోజు వందల మందితో సైరా మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఒక్కరోజు షూటింగ్ ఆగడం వల్ల ఏంకాదులే అన్నట్లు నేను ఈ ఈవెంట్ కి వచ్చేశాను. ప్రేక్షకుల దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేమీ ఉండదు. కంటెంట్ బావుంటే అన్నీ పెద్ద సినిమాలే అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు అల్లు అరవింద్ గారు నన్ను కలిశారు. సినిమా ఎలా నడుస్తుందని అడిగితే.. అంతా బాగానే ఉంది కానీ హీరోతోనే సమస్య.. అతడు నటించిన 'అర్జున్ రెడ్డి'లో అగ్రెసివ్ గా కనిపించాడు. ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ఆదరిస్తారా..? లేదా..? అని సందేహంగా ఉందని అన్నారు. 

అప్పుడు నాకు నేను నటించిన 'విజేత' సినిమా గుర్తొచ్చింది. విజేతకి ముందు వరకు నేను యాక్షన్ సినిమాలు చేశాను. కానీ విజేత విడుదలైన తరువాత నాకు ఆల్ క్లాస్ హీరో అనే ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఈ సినిమా ఆ విధంగా హెల్ప్ అవుతుందని'' అన్నారు. ఇక విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ.. 'ఈ కినేమతో నువ్ స్టార్ వి అయ్యావు. నీకు ఈ సినిమా స్టార్ స్టేటస్ ఇచ్చింది. టాప్ స్టార్ లలో ఒకడిగా మారిన విజయ్ కి వెల్ కమ్ చెబుతున్నా.. అయితే విజయాన్ని తల దగ్గర కాకుండా గుండెల్లో పెట్టుకుంటే ప్రేక్షకులు చివరి వరకు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని' సలహా ఇచ్చారు.