దేశానికి రాజైనా ఓ తల్లికి కొడుకే అనే సామెత మనకి తెలిసిందే. పిల్లలు ఎంత పెద్ద వాళ్లైనా సరే.. తల్లితండ్రులు మాత్రం వారిని పిల్లల్లానే చూస్తుంటారు. మన సెలబ్రిటీలు దానికి అతీతం కాదు. గతంలో అల్లరి నరేష్ 'గమ్యం' సినిమాలో చనిపోయే క్యారెక్టర్ వేశాడు. ఆ సినిమా చూస్తున్న సమయంలో అల్లరి నరేష్ చనిపోయే సీన్ చూసిన ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి.

ఇక అతడి తల్లి బాధని ఊహించలేమట. ఇకపై ఎప్పుడూ అలాంటి సన్నివేశాలు చేయకూడదని కొడుకుకి చెప్పేసిందట. ఇచ్చిన మాట ప్రకారం అల్లరి నరేష్ కూడా అలాంటి రోల్స్ లో కనిపించలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ సంఘటనను షేర్ చేసుకున్నారు.

తన పుట్టినరోజు సమయంలో భార్య సురేఖతో కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లిన చిరు తిరిగొస్తున్న సమయంలో రామోజీ ఫిలిమ్ సిటీలో ఉన్న కొడుకు రామ్ చరణ్ ని చూడడానికి వెళ్లారట. ఆ సమయంలో రామ్ చరణ్ 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. సినిమాలో చరణ్ అల్లు సీతారామారాజు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

సీతారామరాజు విప్లవ వీరుడిగా పరిణామం చెందడానికి ముందు సన్నివేశాల్లో భాగంగా..చరణ్‌ను కొడుతూ, తొక్కుతూ, తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాల్ని రాజమౌళి చిత్రీకరిస్తున్నాడట. అదే సమయానికి షూటింగ్ స్పాట్ కి వెళ్లిన చిరు.. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయారట. 

సురేఖ అయితే ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టేసుకుందట. అలా మాటల సందర్భంలో 'RRR' సినిమాలో కీలక సన్నివేశాన్ని రివీల్ చేశారు చిరు.