Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి.. సినిమాల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని, అంచలంచలుగా ఎదిగి.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అనేక దశాబ్దాలు మంచి నటుడిగానే కాకుండా.. ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా నిలిచారు. ఆయన నటి ప్రస్తానం గురించి... తన జర్నీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చిరంజీవి అనేక సందర్బాల్లో చెబుతూనే ఉన్నారు. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మైండ్ సెట్ మార్చుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు. ఆయన చెప్పిన సూచనలు పాటిస్తే.. మీరు తప్పక విజేతలు అవుతారు... అవేంటో తెలుసుకుందామా..
చాలా మంది అసలు మన జీవితం ఎటుపోతోంది అని ఒకటే ఆందోళనలో ఉంటుంటారు. తాము ఏమీ సాధించలేమా అనే నిరాశతో జీవిస్తుంటారు. అలాంటి వారి మైండ్ సెట్ ముందుగా మార్చుకోవాలి అన్నారు మెగాస్టార్. తాను అలాంటి సిట్యువేషన్ ఫేసి చేసి విజయం సాధించానని అన్నారు. రీసెంట్‌గా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఏదైనా సాధించాలనే తపన, కసితోపాటు.. మన ‘వ్యక్తిత్వం, ప్రవర్తన, మంచితనం.. అనేవి ఏరంగంలోనైనా రాణించేందుకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయన్నారు. అత్యున్నత స్థానానికి ఎదిగినా వారి నడత సరిగా లేకుంటే గుర్తింపు ఉండదన్నారు. అందుకే మైండ్ సెట్‌కు షిప్ట్ అనేది చాలా చాలా అవసరమన్నారు.
ఎవరి జీవితం పూలపాన్పు కాదు... ప్రతి రంగంలో, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి, అయినా విజయం సాధించక తప్పదని చిరు అన్నారు. మన ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయని, డిస్ట్రక్షన్ (విధ్వంసాలు), డిజప్పాయింట్‌మెంట్ (నిరుత్సాహం) ఉంటుంది. ఈక్రమంలో డీ మోటివేట్ (నిరుత్సాహ పరచడం) చేసే వాళ్లుంటారు. ఇలాంటి ఎన్ని ‘డి’లు ఉన్నా.. దాన్ని ‘ఢీ’కొట్టాలంటే డిటర్మినేషన్ (చిత్తశుద్ధి) ఎంతో ముఖ్యం మని మెగాస్టార్ అన్నారు.
అనేక మంది నాకు ఇది చాలు.. సింపుల్‌గా బతికేసి.. ఒకేలా కష్టపడుతూ గానుగెద్దులా జీవితం వెళ్లదీస్తుంటారు. ఇక ఏదో సమయంలో ఉద్యోగం అయితే.. పదవీ విరమణ చేస్తారు. ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ జీవితం చాలిస్తారు. ఇది సరైన విధానం కాదు. ఆలోచన విధానం మార్చుకుని.. కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషన్‌లో ఓ స్థాయికి చేరుకుంటే.. అప్పుడు లభించే తృప్తి వేరే లెవల్లో ఉంటుంది.

విలన్ పాత్రలు చేయమన్నప్పుడు కంగారు పడ్డా..
కళాశాలల్లో నాటకాలు వేస్తే నటనకు మంచి మంచి అవార్డులు వచ్చేవని అప్పుడే సినిమాల్లో వెళ్లాలని అనుకున్నట్లు చిరంజీవి అన్నారు. ఆ మాట ఎవరితో అన్నా.. నువ్వేమన్నా అందగాడివి అనుకున్నావా.. సినిమా రంగం అంటే ఏమనుకున్నావ్.. తెలిసినోల్లు ఉన్నారా అని డిస్కరేజ్ చేశారంట. అయినా.. ఏదో సాధించాలనే పట్టుదలతో పగలు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ, రాత్రి కళాశాలలో చదువు ఇలా.. కొన్నాళ్ల కష్టం తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయని అంటున్నారు చిరంజీవి.
హీరోగా ఎదుగుతున్న క్రమంలో తనను రౌడీ వేషాలు వేయాలని అడిగారని, అప్పుడు లోపల ఓ భయం ఉండేదన్నారు. చట్టానికి కళ్లులేవు వంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే.. కొందరు నిర్మాతలు చిన్న చిన్న రౌడీ వేషాలు వేయమంటున్నారేంటి? అనుకునేవాడిని.. కానీ లోపల ఒకటే ధైర్యం.. ఎన్ని పాత్రలో నటించినా,, కచ్చితంగా సినిమా రంగంలో రాణిస్తాననే నమ్మకం బలంగా ఉండేదన్నారు. ఆ సంకల్పమే తనను ఇండస్ట్రీలో నిలబెట్టిందని చిరు చెప్పారు.
