ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన భార్య మేఘన సర్జాకి, అలాగే ఈ మధ్యే జన్మించిన కుమారుడు జూనియర్‌ చిరంజీవి సర్జాకి, అలాగే మేఘనా తల్లిదండ్రులకు కూడా కరోనా సోకిందని మేఘన వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 

`హలో.. మా అమ్మా నాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ణారణ అయ్యింది. గత కొన్ని మమ్మల్ని కలిసి వారు కూడా పరీక్షలు చేయించుకోండి. ప్రస్తుతం మేమంతా చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి అభిమానులకు ఓ విజ్ఞప్తి, జూనియర్‌ చిరు ఆరోగ్యంగానే ఉన్నారు. నేను అతనివెంటే ఉన్నా. ఎవరూ ఆందోళన చెందొద్దు. మహమ్మారిపై యుద్దంలో మా ఫ్యామిలీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం, మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని తెలిపింది. 

యాక్షన్‌ స్టార్‌ అర్జున్‌ మేనల్లుడే చిరంజీవి సర్జా. ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. అప్పటికే మేఘన గర్బవతిగా ఉన్నారు. గత అక్టోబర్‌లో ఆమె జూనియర్‌ చిరంజీవి సర్జాకి జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే మేఘన తన భర్త లేకపోవడంతో చిరంజీవి కటౌట్‌ని పక్కన పెట్టుకుని సీమంతం చేసుకోవడం విశేషం.