మెగా బ్రదర్‌, టాలీవుడ్‌ అజాత శత్రువు నాగబాబుకి ఆయన అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే విశెష్‌ చెప్పారు. చాలా స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, నాగబాబుకి మరింత స్పెషల్‌ చేశారు. ట్విట్టర్‌ ద్వారా చిరంజీవి స్పందించారు. 

`నా ఉద్రేకపూర్వక విధేయుడు, నా ఎమోషనల్‌, దయగల, సరదగా ప్రేమగల సోదరుడు నాగబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు ఇది మరింత గొప్పగా సాగాలి. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టిన రోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, తాను కలిసి ఉన్న ఓ ఫోటోని పంచుకున్నారు. 

చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా, రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న నాగబాబు ఆటు వెండితెరపై నటుడిగా, ఇటు బుల్లితెరపై నటుడిగా, జడ్జ్ గా వ్యవహరిస్తూ రాణిస్తున్నారు. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమైన విషయం తెలిసిందే. తాను నిర్మించిన `ఆరేంజ్‌` సినిమా, ఇటీవల సహ నిర్మాతగా వ్యవహరించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రాలు పరాజయం చెందాయి. ఆయన కుమారుడు, హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా రాణిస్తున్నారు. నాగబాబు పెద్ద అండగా, సపోర్ట్ గా ఉంటున్నాడు. మరోవైపు నటిగా తెరంగేట్రం చేసి సక్సెస్‌ కాలేకపోయిన తన కూతురు నిహారిక త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ఇప్పటికే ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే.