Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో చిరు ఈవెంట్ చిచ్చు: శివాజీ రాజా వర్సెస్ నరేష్, అసలేమైంది?

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లోని విభేదాలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల అమెరికాలో నిర్వహించిన చిరంజీవి ఈవెంట్ ఈ చిచ్చుకు కారణమైనట్లు అర్థమవుతోంది.

Chiranjeevi's US event creates havoc in MAA
Author
Hyderabad, First Published Sep 3, 2018, 3:19 PM IST

హైదరాబాద్: తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లోని విభేదాలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల అమెరికాలో నిర్వహించిన చిరంజీవి ఈవెంట్ ఈ చిచ్చుకు కారణమైనట్లు అర్థమవుతోంది. మా అధ్యక్షుడు శివాజీ రాజాపై నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం అచ్చయింది. 

ఆ వార్తాకథనం నేపథ్యంలో శివాజీ రాజా, హీరో శ్రీకాంత్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న మా ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నారు. 

నిధుల దుర్వినియోగానికి సంబంధించి నరేష్ అన్ని వివరాలు సేకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో నరేష్ మా అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త రాసే సమయంలో నరేష్ ఆ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

అమెరికాలో ఇటీవల నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమం నిర్వహించారు. మా సొంత భవన నిర్మాణానికి, అవసరమైన ఆర్టిస్టులకు సాయం చేయడానికి విరాళాల సేకరణకు మెగాస్టార్ చిరంజీవి అనుమతి ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. 

అలా సేకరించిన విరాళాలను కొంత మంది మా ప్రతినిధులు తమ సొంత జేబుల్లో వేసుకున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపణగా కనిపిస్తోంది. మా అమెరికా పర్యటనకు సంబంధించి గానీ, ప్రధాన కార్యదర్శిని సంప్రదించడం గానీ చేయలేదని, అందుకు మాలోని కొందరు ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారని అంటున్నారు. 

అమెరికాకు ఎంత మంది వెళ్తున్నారని, ఎవరెవరు వెళ్తారని అడగడానికి నరేష్ శివాజీ రాజాకు ఫోన్ చేశారని, అయితే శివాజీ రాజా నుంచి ఏ విధమైన సమాధానం లేదని ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం సారాంశం. 

మరో విషయం కూడా వివాదంగా మారినట్లు కనిపిస్తోంది. చాలా ఏళ్ల నుంచి రికార్డులకు ఎక్కిన కార్యవర్గ సమావేశం వివరాలను తొలగించారని కూడా అంటున్నారు. ఇటీవలి కార్యవర్గ సమావేశం వివరాలు మాత్రమే నమోదై ఉన్నాయని, పాతవాటిని కనిపించకుండా చేశారని అంటున్నారు. 

శివాజీ రాజాను లక్ష్యంగా ప్రత్యర్థి వర్గం దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి వివాదాన్ని సరిగా డీల్ చేయడంలో శివాజీ రాజా విఫలమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శివాజీ రాజా నోటి దురుసు వల్ల గతంలో ఎప్పుడూ లేనంత చెడ్డ పేరు మాకు వచ్చిందనే విమర్శలు కూడా అన్నాయి.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను శివాజీ రాజా ఖండించారు. శివాజీ రాజాకు హీరో శ్రీకాంత్ మద్దతుగా నిలిచారు. నరేష్ వర్గం మీడియా సమావేశం ఏర్పాటు తర్వాత వివాదం ఏ విధమైన మలుపు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..

మోసం చేశానని నిరూపిస్తే.. గుండు కొట్టించుకుంటా: నటుడి సంచలన వ్యాఖ్యలు!

శివాజీరాజా నిజంగానే మోసం చేశాడా..?

Follow Us:
Download App:
  • android
  • ios