చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ఆగకుండా వివాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం దాకా ఉయ్యాలవాడ వంసస్ధుల 50 కోట్ల వివాదం సాగింది. తమని మోసం చేసారంటూ వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే తమ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కాదని దర్శకుడు సురేంద్రరెడ్డి తేల్చి చెప్పటంతో ఆగింది. ఈ లోగా  ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ మరో వివాదం మొదలైంది.

ఈ సారి… వడ్డెర  కులస్తులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. నర్సింహారెడ్డి  ప్రధాన అనుచరుడు  అయిన  వడ్డెర ఒబన్న  క్యారెక్టర్ ను  వక్రీకరించి..  సినిమా తీశారని ఆరోపించారు. ఒబన్న ప్రాత్రను  తమిళనాడుకు  చెందిన  రాజు పాండే  అని …లేని  పాత్రను సృష్టించి.. చరిత్రను  వక్రీకరించారన్నారు. సినిమాను  ఆపకపోతే విడుదలైన  రోజే థియేటర్లలో  సినిమాను  అడ్డుకుంటామని  హెచ్చరించారు.

ఇంతకు ముందు నరసింహారెడ్డి  ప్రధాన అనుచరుడు వడ్డె ఓబన్న పాత్ర లేకుండా రూపొందించారంటూ వడ్డెర కమ్యూనిటీ ఆల్‌ ఇండియా యూనియన్‌, వైఎ్‌సఆర్‌ వడ్డెర సంఘం నేతలు ఇంతకు ముందు ధ్వజమెత్తారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా నరసింహారెడ్డితో కలిసి పోరాడిన ఓబన్నను సినిమాలో పూర్తిగా విస్మరించారని.. ఓసీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. దీనికి నిరసనగా యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం కర్నూలులో ర్యాలీ చేపట్టి రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ధర్నా చేశారు. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని డీఆర్వో వెంకటేశానికి వినతిపత్రం సమర్పించారు.

ఇదిలా ఉంటే..  సైరా.. జీవిత చరిత్ర కాదని పేర్కొంటూ ఆ సినిమా దర్శకుడు సురేందర్‌రెడ్డి హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని దక్షిణాది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులతో కలిసి ఆయన మాట్లాడారు.