మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం మహర్షి. మెసేజ్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా, కమర్షియల్ గానూ భారీగా వర్కవుట్ అయ్యింది. ఈ నేపద్యంలో ఇలాంటి కథనే చిరంజీవి కి సైతం కొరటాల శివ రెడీ చేసారని ఫిల్మ్ సర్కిల్స్  లో వినపడుతోంది. 

మెగాస్టార్‌ చిరంజీవి, స్టార్ డైరక్టర్  కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరా నర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు 152వ సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. రెండు పాత్రలు వేటికవే విభిన్నమైనవి అని చెప్తున్నారు. మహర్షిలో ఎన్నారై మహేష్..రైతుగా మారి వ్యవసాయం చేస్తారు. 

ఇక్కడ చిరంజీవి ఓ పాత్ర‌లో ఎన్.ఆర్‌.ఐగా మరో పాత్రలో రైతుగా క‌నిపించ‌బోతున్నాడు.  ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన వైవిధ్యం చూపించ‌డానికి కొర‌టాల ప్ర‌య‌త్నిస్తున్నాడు. రైతు పాత్ర‌కీ, ఎన్ఆర్.ఐకీ వ‌య‌సులో చాలా తేడా చూపించ‌బోతున్నాడ‌ట‌. అంటే.. చిరు గెట‌ప్ కూడా పూర్తిగా మార‌బోతోంద‌న్న‌మాట‌. ఫన్,ఎంటర్టైన్మెంట్ కలపి ఈ కథను వండారట. 

వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 22న కొర‌టాల చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వ‌నుంది. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుందట‌. అన్నికార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.