మన దేశానికి గొప్ప సేవలందించిన వారిలో మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఓ సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన అశేషమైన సేవలందించారు. సైన్స్ పరంగా మన దేశాన్ని పురోగతి సాధించడంలో ఆయన కృషి చాలా పెద్దది.  దేశం గర్వించదగ్గ రాష్ట్రపతి కూడా.  ఆయన జయంతి నేడు(గురువారం). అక్టోబర్‌ 15, 1931లో జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా అబ్దుల్‌ కలాంని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. 

ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, అబ్దుల్‌ కలాం.. దేశ గొప్ప రాష్ట్రపతుల్లో ఒకరు. మన గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు. గొప్ప మనవతావాదుల్లో ఒకరని, ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఆలోచనలు, అద్భుతమైన జ్ఞానం కొన్ని తరాలలో స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఈసందర్భంగా కలాంతో దిగిన ఫోటోని చిరంజీవి పంచుకున్నారు. కలాం 2015 జులై 27న కన్నుమూసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.