`ఆచార్య` షూటింగ్‌ ఊపందుకోనుంది. చిరంజీవి కూడా రెడీ అయ్యారు. ఇక ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌ జరిపేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నారు. `ఆచార్య`కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ని ఈ నెల తొమ్మిదిన ప్రారంభించారు. చిరంజీవి షూటింగ్‌లో పాల్గొనేందుకు డిసైడ్‌ అయ్యారు. ముందస్తుగా కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో చిత్ర యూనిట్‌ షాక్‌కి గురయ్యింది. షూటింగ్‌ ఆపేశారు. 

తనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మూడు రోజుల తర్వాత మరోసారి చిరంజీవి కరోనా టెస్ట్ చేసుకున్నారు. దీంతో నెగటివ్‌ వచ్చింది. అయితే ముందుగా కరోనా కిట్‌ లోపం వల్లే పాజిటివ్‌ వచ్చిందని తేలింది. ఇప్పుడు నెగటివ్‌ రావడంతో షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 20 నుంచి, అంటే రేపటి(శుక్రవారం) నుంచి `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరు సన్నద్ధమవుతున్నారట. శరవేగంగా షూటింగ్‌ జరపాలని భావిస్తున్నారు. అందుకు అన్ని రకాలుగా పక్కా ప్లాన్‌ రెడీ చేశారట దర్శకుడు కొరటాల శివ. 

ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె ఇటీవలే మ్యారేజ్‌ చేసుకున్న కాజల్‌ ప్రస్తుతం తన భర్త గౌతమ్‌తో కలిసి హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అది పూర్తి చేసుకుని వచ్చాక కాజల్‌ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుందట. ఆమె డిసెంబర్‌ ఐదు నుంచి చిత్రీకరణలో పాల్గొననుందని తెలుస్తుంది. ఇక సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకాలపై రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.