అయోధ్యలో చిరంజీవి... ఆ హనుమంతుడు స్వయంగా ఆహ్వానించినట్లుగా ఉంది!
అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం దక్కించుకున్న అతికొద్ది మంది ప్రముఖుల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న చిరంజీవి తన రియాక్షన్ తెలియజేశాడు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాగా నేడు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కీలక ఘట్టాన్ని దేశవ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం దక్కింది. టాలీవుడ్ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం ఉంది.
చిరంజీవి సతీసమేతంగా అయోధ్యకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. వీరితో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం దక్కడంపై చిరంజీవి స్పందించారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ''ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం దక్కడం చాలా సంతోషంగా ఉంది. నాకు హనుమాన్ అత్యంత ఇష్ట దైవం. ఆయనే స్వయంగా నన్ను ఆహ్వాయించినట్లుగా ఉంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన వారిని ప్రోత్సహించకుండా ఉండలేకపోతున్నాను'' అని అన్నారు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో విశ్వంభర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. బింబిసార వశిష్ఠ దర్శకుడు. ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.