ముప్పై ఏళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, సీరియర్‌ నటుడు మురళీ మోహన్‌, మరో నటుడు శరత్‌ కుమార్‌ కలిశారు. ఈ అరుదైన కలయిక ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంటే, ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ముగ్గురు నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు ఒకే చోట కావడంతో ఈ రేర్‌ కాంబినేషన్‌ ఫోటోకి పోజిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవి, మురళీ మోహన్‌, శరత్‌ కుమార్‌ కలిసి `గ్యాంగ్‌లీడర్‌` చిత్రంలో నటించారు. ఇందులో ఈ ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. ఇది విడుదలైంది 1991లో. దీంతో ముప్పై ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు కలుసుకోవడం ఈ ముగ్గురికి ఆనందాన్నివ్వడంతోపాటు అభిమానులకు సర్‌ప్రైజ్‌నిచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ మురళీ మోహన్‌ ఈ ఫోటోని పంచుకున్నారు. ఈ సంద్భంగా ఆయన  తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

`రామోజీ ఫిల్మ్ సిటీలో మేం ముగ్గురం మూడు డిఫరెంట్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాం. పక్కనే కావడంతో `ఆచార్య` షూటింగ్‌లో చిరంజీవిని కలుసుకోవడం జరిగింది. నేను ఆర్కే మీడియా వారి షూటింగ్‌లో ఉన్నాను. శరత్‌ కుమార్‌.. మణిరత్నం సినిమాలో నటిస్తున్నారు. మేం ముగ్గురం కలుసుకోవడంతో ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం. అందులో మేం అన్నదమ్ములుగా నటించాం. ఈ మూవ్‌మెంట్‌ని చిరంజీవి బాగా ఎంజాయ్‌ చేశారు. వెంటనే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి, ఈ సంతోషాన్ని అభిమానులకు కూడా పంచాలని ఫోటోలు తీయించార`ని మురళీ మోహన్‌ చెప్పారు. 

ఇక 1991లో వచ్చిన `గ్యాంగ్‌లీడర్‌` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. విజయ బాపినీడు దర్శకత్వంలో ఆ సినిమా రూపొందింది. ఈ సినిమా చిరంజీవి మాస్‌ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. ఇందులో రఘుపతి రాఘవ రాజారామ్‌గా ఈ ముగ్గురు నటించారు. రఘుపతిగా మురళీ మోహన్‌, రాఘవగా శరత్‌ కుమార్‌, రాజారామ్‌గా చిరంజీవి నటించారు.