చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది నటులకు చిరంజీవి చేయూత ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి, వేల మందిని ఆదుకోవడం జరిగింది. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుని చిరంజీవి స్వయంగా ఆయన నివాసంలో కలిశారు. నిబద్ధత గల పాత్రికేయుడిగా దశాబ్దాలు పనిచేసిన రామ్మోహన నాయుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. 

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన వైద్యం కూడా తీసుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని తెలుసుకొని, చిరంజీవి ఆయన్ని కలవడం జరిగింది. రామ్మోహన్ నాయుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. కొంత ఆర్ధిక సాయం ప్రకటించడంతో పాటు, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారట. 

చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రామ్మోహన్ నాయుడు ఆ పార్టీ కోసం ఎంతగానో శ్రమించారు. రామ్మోహన్ చిరంజీవికి సన్నిహితుడు అని కూడా తెలుస్తుంది. మరో వైపు నిహారిక వెడ్డింగ్, ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఆప్తుల కోసం సమయం కేటాయించి, వారికి అండగా నిలవడం అభినందించ దగ్గ విషయమే.