చిరంజీవి నెక్ట్స్ సినిమాలపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇద్దరు దర్శకుల పేరు ప్రధానంగా వినిపిస్తుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో హిట్లు చూశాడు, పరాజయాలు చూశాడు. ఆయనకు ఫ్లాప్‌లు పెద్ద లెక్క కాదు. కానీ ఇటీవల సినిమా పరాజయం అయితే ఆ ప్రభావం బిజినెస్‌పై పడుతుంది. నెక్ట్స్ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. దీనికితోడు విపరీతమైన ట్రోలింగ్‌. అందుకే జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి మనసు మార్చుకున్నారు. ట్రెండ్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. స్ట్రెయిట్‌ కథలకే ఓకే చెబుతున్నారు. నెక్ట్స్ కూడా ఆయన స్ట్రెయిట్‌ మూవీతోనే రాబోతున్నారు. అంతేకాదు ఇక రీమేక్‌ల జోలికి వెళ్లదలుచుకోలేదట. 

ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్ట్స్ సినిమాలపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇద్దరు దర్శకుల పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అందులో `బింబిసార` ఫేమ్‌ వశిష్ట(వేణు మల్లిడి), కళ్యాణ్‌ కృష్ణ పేరు తెరపైకి వచ్చింది. చాలా రోజులుగా ఈ ఇద్దరు చిరంజీవికి టచ్‌లో ఉన్నారు. వీరిలో ఎవరిది మొదట చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల వశిష్టతో నెక్ట్స్ సినిమా ఉంటుందన్నారు. కానీ అది ఇంకా ఫైనలైజ్‌ కాలేదని సమాచారం. కళ్యాణ్‌ కృష్ణతో రీమేక్‌ పేరు వినిపించింది. మలయాళంలో హిట్‌ అయిన `బ్రో డాడీ` రీమేక్‌ అంటూ వార్తలొచ్చాయి. 

అంతేకాదు `బ్రో డాడీ` రీమేక్‌లో కాస్టింగ్‌ కూడా ఫిక్స్ అయ్యిందన్నారు. చిరంజీవి, శర్వానంద్‌, త్రిష, శ్రీలీల ఫైనల్‌ అయ్యారని తెలిసింది. కానీ చిరంజీవి నెక్ట్స్ చేయబోయేది కళ్యాణ్‌ కృష్ణతోనే అంటున్నారు. అయితే ఇది రీమేక్‌ కాదని సమాచారం. స్ట్రెయిట్‌ ఫిల్మే అని అంటున్నారు బెజవాడ ప్రసన్న కుమార్‌ కథతో సినిమా చేయబోతున్నారట. దీనికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడు. ఇది కూడా తండ్రీ కొడుకుల కథే అని, ఇందులోనే చిరంజీవి, శర్వానంద్‌ కలిసి నటిస్తున్నారని సమాచారం. వీరి సరసన త్రిష, శ్రీలీల హీరోయిన్లుగా ఫైనల్‌ అయ్యారట. 

నిజానికి ఈ చిత్రం అత్తా కోడళ్ల మధ్య జరిగే కథ అని, వారి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఉంటుందని అంటున్నారు. తండ్రి కొడుకులుగా చిరు, శర్వాలు కనిపిస్తారట. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుందని తెలుస్తుంది. మెగాస్టార్‌ తన పుట్టిన రోజుకి ఈ సినిమాని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

కళ్యాణ్‌ కృష్ణతోనే చిరు సినిమా చేయడానికి మరో కారణం కూడా ఉంది. వశిష్ట తెచ్చిన కథ సోషియో ఫాంటసీ. ఇది భారీ బడ్జెట్‌ మూవీ. చిరంజీవికి `భోళాశంకర్‌` పెద్ద దెబ్బ కొట్టడంతో అంత బడ్జెట్‌ పెట్టి చేయడం పెద్ద రిస్క్ తో కూడిన విషయం. బిజినెస్‌ కాదు. అది నిర్మాతలకు పెద్ద భారమైన విషయం. కానీ కళ్యాణ్‌ కృష్ణ మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఫ్యామిలీ అంశాలతో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. పైగా నిర్మాత కూడా తన కూతురు సుస్మిత. అందుకే ఈ సినిమాకి చిరు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ పుట్టిన రోజుకి చిరు ఈ సినిమానే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

తాజాగా చిరంజీవి `భోళాశంకర్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మెహెర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అనిల్‌ సుంకర నిర్మించారు. తమన్నా కథానాయికగా నటించింది. కీర్తిసురేష్‌ చెల్లిగా చేసింది. ఈ సినిమా శుక్రవారం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రీమేక్‌ అయినా నేపథ్యంలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో చిరంజీవి ఇక రీమేక్‌ల జోలికి వెళ్లదలుచుకోలేదని సమాచారం.