తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంది అవార్డ్స్ పై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
జర్నలిస్ట్స్ కి హెల్త్ కార్డ్స్ జారీ చేయడం కోసం తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఓ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి (Chiranjeevi), తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపై ప్రసంగించిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కెరీర్ లో ఎదగడంలో జర్నలిస్ట్ పాత్రను ఆయన కొనియాడారు. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమా గురించి, తన పాత్ర గురించి ఎవరైనా రాయాలి, ఓ ఫోటో ప్రచురించాలని ఎంతో తాపత్రయ పడేవాడిని, ఆ సమయంలో పసుపులేటి రామారావు నా గురించి రాశారు.
ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నాను. ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాను. అప్పటి నా సంపాదన నుండి వేయి రూపాయలు ఆయనకు ఇవ్వబోతే, ఆయన తీసుకోలేదు. డబ్బుల కోసం నేను రాయలేదు, కేవలం మీ టాలెంట్ నచ్చి రాశానన్నారు. అలాగే మరో జర్నలిస్ట్ నా డైలాగ్ డెలివరీ లోని లోపాలు తెలియజేశారు. ఇలా జర్నలిస్టులు నా కెరీర్ కి ఎంతగా ఉపయోగపడ్డారు.
అందుకే జర్నలిస్టులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. దానిలో భాగంగానే కరోనా సమయంలో జర్నలిస్టులు సినిమా 24 క్రాప్ట్స్ లోకి రాకున్నా, వారికి సహాయం చేశాము. సినిమా జర్నలిస్టులు అందరూ సౌత్ ఇండియా ఆర్టిస్ట్స్ కి అవార్డుల ప్రదానం చేయాలని సంకల్పించారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనిది. మిగతా భాషల జర్నలిస్టులతో కూడా మాట్లాడి, ఈ అవార్డుల ప్రదానం జరిగేలా చూస్తాం. ఈ ఏడాది నవంబర్ నుండి అవార్డుల కార్యక్రమం జరగనుంది.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నంది అవార్డులు కూడా నిరాదరణకు గురయ్యాయి. అలాంటి సమయంలో జర్నలిస్టులు సౌత్ ఇండియా నటులకు అవార్డులు ఇవ్వాలని సంకల్పించడం గొప్ప విషయం. మంత్రి తలసాని శ్రీనివాస్ గారు మా చిత్రాల వసూళ్ల నుండి జర్నలిస్ట్స్ సంక్షేమం కోసం ఓ లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. చాలా మంది ఆలోచన అది. తప్పకుండా చేస్తాం. అలాగే జర్నలిస్ట్స్ కి ఏ సహాయం కావాల్సినా చేయడానికి సిద్ధంగా ఉంటాము.. అంటూ చిరంజీవి తన ప్రసంగం ముగించారు.
