చిరంజీవి హీరోయిన్‌ రిమీ సేన్‌ మోసపోయింది. జిమ్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి కోట్లల్లో మోసపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

చిరంజీవి(Chiranjeevi) హీరోయిన్‌ దారుణంగా మోసపోయింది. ఆమె కోట్లల్లో మోసపోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చిరంజీవితో `అందరివాడు`లో హీరోయిన్‌గా నటించిన రిమీ సేన్‌(rimi sen) ఏకంగా రూ.4.14కోట్లు మోసపోయిన విషయం ఇప్పుడు దుమారం రేపుతుంది. గోరేగావ్‌కి చెందిన వ్యాపారవేత్త ఇన్వెస్టిమెంట్‌ పేరుతో తనని మోసం చేసినట్టు తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ను మూడేళ్ల క్రితం అంధేరిలోని జిమ్‌లో కలిసినట్లు రిమీ సేన్‌ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని, మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్‌లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్‌ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్‌ వ్యాస్‌ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినట్టు వెల్లడించింది. రిమీ సేన్‌ ఫిర్యాదు మేరకు జతిన్‌ వ్యాస్‌పై ఐపీసీ సెక్షన్‌లు 420, 409 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్‌ పోలీసులు తెలిపారు. రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

రిమీ సేన్‌ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్‌ బచ్చన్‌ సరసన సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన 'ధూమ్‌' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి డబుల్‌ రోల్‌ చేసిన 'అందరివాడు' చిత్రం హీరోయిన్‌గా చేసి మెప్పించింది. ఈ సినిమా కంటే ముందు ఆమె `ఇది నా మొదటి ప్రేమ లేఖ`, `నీ తోడు కావాలి` సినిమాల్లో నటించింది. 

ఇక `అందరివాడు` సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. తనయుడి పాత్రకి జోడీగా నటించింది రిమీ సేన్‌. ఆ తర్వాత తెలుగు చిత్రాలకు దూరమైంది. కేవలం హిందీ సినిమాల్లోనే నటించింది. `గరం మసాలా`, `ఫిర్ హేరా ఫేరీ`, `క్యూన్‌ కి`, `గోల్‌మాల్‌`, `బాగ్‌బాన్‌`, `హంగామా` వంటి సినిమాల్లో కూడా నటించి బాలీవుడ్‌లో అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. చివరగా 2016లో `బుధియాసింగ్‌` అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోంది.