ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన చిరంజీవి ఆసక్తికర విషయం వెల్లడించారు. తన ఫస్ట్ డే షో ఫస్ట్ అనుభవం దారుణమని తెలియజేశారు.
దివంగత ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు మానవరాలైన శ్రీజ నిర్మాతగా తెరకెక్కిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడిద నాగేశ్వరరావు గారి కుటుంబంతో గల అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబంలో నేను ఓ మనిషిని అంటూ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర హీరో శ్రీకాంత్ రెడ్డి, హీరోయిన్ సంచితా బసుతో పాటు డైరెక్టర్స్ వంశీధర్, లక్ష్మీనారాయణలకు బెస్ట్ విషెష్ తెలియజేశారు. నిర్మాత శ్రీజ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పరిశ్రమకు అమ్మాయిలు రావాలి, మా ఫ్యామిలీ నుండి నిహారిక, సుస్మిత వచ్చారు. వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన తెలియజేశారు.
మంచి సబ్జక్ట్స్ ఎంచుకొని విజయాలు సాధించి ముందుకు వెళ్లాలని శ్రీజకు సూచించారు. కాగా యాంకర్ సుమ చిరంజీవిని ఓ ప్రశ్న అడిగారు. ప్రతివారి జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం ఉంటుంది? మరి మీ అనుభవం ఏమిటో చెప్పాలని? అభ్యర్ధించారు. తన ప్రసంగం చివర్లో ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పారు. తన జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం చాలా దారుణమైనది అన్నారు.
సంవత్సరం గుర్తు లేదు కానీ.. ఎన్టీఆర్ గారి రాము సినిమా ఫస్ట్ షో చూడాలని వెళ్లి దెబ్బలు తిన్నట్లు తెలియజేశారు. మేము నెల్లూరులో ఉన్నరోజుల్లో మా చుట్టాలబ్బాయి పూర్ణ అని ఒకడు ఉండేవాడు. వాడు ఎన్టీఆర్ కి వీరాభిమాని. రాము సినిమా చూడాలని నన్ను, నాగబాబును థియేటర్ కి తీసుకెళ్లాడు. వాడు నేల టికెట్ కొని సినిమాలు చూసేవాడు. నాన్నగారు మమ్మల్ని మాత్రం కుర్చీకి మాత్రమే తీసుకెళ్లేవారు. టికెట్స్ తీసుకొని నేల వైపుకు వెళుతుంటే, అటూ ఇటూ గోడలు చీకటి, మధ్యలో క్యూ ఆగిపోయింది. మాకు ఊపిరి ఆడలేదు. లాభం లేదని బయటికి రాగానే, మా నాన్నగారు అమ్మతో పాటు సినిమా చూసి బయటికి వచ్చారు.
బాగా చిన్నవాడైన నాగబాబు అప్పటికే చెమటలు కారిపోయి బిక్కముఖం పెట్టుకొని ఉన్నాడు. మమ్మల్ని అక్కడ చూసిన నాన్న, థియేటర్ స్తంభాలకు చుట్టిన కొబ్బరి మట్ట విరుచుకున్నాడు. వాడు జనంలో చనిపోతే పరిస్థితి ఏంటని పిచ్చ కొట్టుడుకొట్టాడు. ఆయనకు ఆవేశం వస్తే ఆగదు. మా చుట్టాల ఇంటి వరకూ కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. నా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం అలాంటిది. ఇప్పటికీ ఏవిఎం రాము అంటే భయం వేస్తుంది, అంటూ అలనాటి భయంకర అనుభవాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
