గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి!
చిరంజీవి మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న సినిమాటోగ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆర్థిక సహాయం చేశారు.

సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉంది. దేవరాజ్ ఆరోగ్యం కూడా సరిగాలేదని సమాచారం. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్ళింది. వెంటనే దేవరాజ్ ని ఆదుకోవాలని ఆయన భావించారు. ఆయన్ని తన ఇంటికి పిలిపించారు. దేవరాజ్ తన కుమారుడితో పాటు చిరంజీవి నివాసానికి రావడం జరిగింది. దేవరాజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న చిరంజీవి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేశారు. దీనికి సంబంధించిన చెక్ అందజేశారు.
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న చిరంజీవికి దేవరాజ్ తో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి మంచి మనసును పలువురు కొనియాడుతున్నారు. దేవరాజ్ పలు భాషల్లో 300 వందలకు పైగా చిత్రాలకు కెమెరా మెన్ గా పనిచేశారు. చిరంజీవి కెరీర్ బిగింగ్ లో నటించిన నాగు, పులి బెబ్బులి వంటి చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. దేవరాజ్ తో చిరంజీవికి మంచి అనుబంధం ఉందని వినికిడి.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రజినీకాంత్, నాగార్జున... వంటి టాప్ అండ్ సీనియర్ హీరోలతో ఆయన పనిచేశారు. వయసు పెరగడంతో పాటు అనారోగ్యం కారణంగా ఆయన పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన మీదే ఆధారపడిన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుంది. చిరంజీవి ముందుకు వచ్చి కొంత మేరకు ఆదుకున్నాడు.