నటుడు నర్సింగ్‌ యాదవ్‌ భార్య చిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా చిరంజీవి తమని ఎంతగా ఎంకరేజ్‌ చేసేవారో తెలియజేసింది. 

తెలంగాణ యాసలో విలనిజం పలికించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నర్సింగ్‌ యాదవ్‌. విలనిజంలోనూ కామెడీ పండిస్తూ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. డిసెంబర్‌ చివరి రోజున కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ విషాదం నుంచి నర్సింగ్‌ యాదవ్‌ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఈ క్రమంలో నర్సింగ్‌ యాదవ్‌ భార్య చిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా చిరంజీవి తమని ఎంతగా ఎంకరేజ్‌ చేసేవారో తెలియజేసింది. 

చిరంజీవి ఫ్యామిలీతో తమకి మంచి అనుబంధం ఉందని వెల్లడించింది. ఆయన నటించే ప్రతి సినిమాలో నర్సింగ్‌ యాదవ్‌ని తీసుకునే వారని, చిరంజీవి ఏ సినిమా షూటింగ్‌లోకి అడుగుపెట్టినా ముందు నర్సింగ్‌ యాదవ్ ఉండాల్సిందే అని, ఆయన అక్కడ లొకేషన్‌ పరిస్థితులను చక్కబెట్టేవారని తెలిపింది. చిరంజీవి వచ్చాక ఫస్ట్ నర్సింగ్‌ వచ్చాడా? అని కచ్చితంగా అడిగేవారని తెలిపింది. అలా వారిద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరిగిందన్నారు. తాము చాలా సార్లు చిరంజీవి ఇంటికి వెళ్లేవాళ్లమని చెప్పింది. గత పదేళ్ల వరకు చిరుకి రాఖీ కట్టేదట. అయితే తమకి బాబు పుట్టినప్పుడు చిరు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపింది చిత్ర.

`మా బాబు పుట్టిన మూడు నెలలకు అతడిని తీసుకుని చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాను. మమ్మల్ని చూడగానే మెగాస్టార్‌ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేనేజర్‌ను పంపించి అప్పటికప్పుడు బంగారు చైన్‌ కొని తీసుకురమ్మన్నారు. నర్సింగ్‌కు బాబు పుట్టాడన్న సంతోషంతో ఆ ఖరీదైన గోల్డ్‌ చెయిన్‌ను పిల్లోడి మెడలో వేశారు. అది ఏడు తులాల కంటే ఎక్కువే ఉంటుంది. సురేఖ గారు కూడా పసుపు బొట్టు ఇచ్చారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. వారు మాపై చూపించిన ప్రేమకి ఆశ్చర్యమేసేది` అని తెలిపారు.

`నర్సింగ్‌కు రామ్ గోపాల్ వర్మ గురువు లాంటి వారు అయితే.. చిరంజీవి మాత్రం ప్రాణం.. గాడ్ ఫాదర్ వంటివారు. నర్సింగ్‌తో చాలా ఆప్యాయంగా ఉండేవారు. నర్సింగ్ మరణించాక పది రోజున ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఖైదీ నెంబర్‌ 150లో పట్టుబట్టి ఓ చిన్న పాత్రలో నర్సింగ్‌ని నటింప చేశార`ని గుర్తు చేశారు. నర్సింగ్‌ యాదవ్‌, చిత్రలకు కుమారుడు రిత్విక్‌ యాదవ్‌ ఉన్నారు. నర్సింగ్‌ యాదవ్‌ `ఠాగూర్‌`, `పోకిరి`, `మనీ మనీ`, `గాయం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అనుకోకుండా ఒక రోజు`, `క్షణ క్షణం` వంటి అనేక హిట్‌ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.