చిరంజీవి నాల్గో సినిమాని కన్ఫమ్‌ చేశారు. నలుగురు దర్శకుల ఫోటోని పంచుకుని తన నాల్గో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్‌. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని రిపబ్లిక్‌ డే కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇటీవల మరో సినిమాని ప్రారంభించారు. 

మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్‌ని ప్రారంభించారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్లపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్వీప్రసాద్‌, ఆర్‌బి చౌదరి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతోపాటు తమిళ హిట్‌ చిత్రం `వేదాళం` రీమేక్‌ చేస్తున్నారు. దీనికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించనున్నారు. దీంతోపాటు మరో సినిమాకి ఆయన కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. 

తాజాగా చిరంజీవి నలుగురు దర్శకులతో కూడిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. నా నలుగురు దర్శకులు అని చెప్పారు. ఇందులో కొరటాల శివ, మోహన్‌రాజా, మెహర్‌ రమేష్‌తోపాటు దర్శకుడు బాబీ ఉన్నారు. అయితే బాబీతో సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. `లూసిఫర్‌` రీమేక్‌ స్క్రిప్ట్ పై ఆయన కొన్ని రోజులు వర్క్ కూడా చేశారు. కానీ ఈ విషయంలో చిరు సంతృప్తి చెందలేదు. దీంతోపాటు మోహన్‌రాజాని ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. కానీ బాబీతో మరో కథకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. తాజాగా చిరంజీవి దీన్ని కన్ఫమ్‌ చేశారు. మోహన్‌రాజా, మెహర్‌ రమేష్‌ సినిమాల తర్వాత బాబీ సినిమా ఉంటుందని టాక్.