ప్రముఖ నటుడు రాళ్ళపల్లి (73) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రాళ్ళపల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని వాణి మహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు మొదటిసారి రాళ్ళపల్లిని స్టేజ్ మీద కలిసినట్లు.. నటన చూసి ముగ్దుడినయ్యానని చిరంజీవి అన్నారు. ఆ తరువాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత పలు చిత్రాల్లో ఆయనతో కలిసినట్లు చెప్పారు.

ఈ క్రమంలో ఆయనతో అనుబంధం పెరిగిందని, ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారని అన్నారు. చాలా రోజుల తరువాత 'మా' ఎన్నికల సందర్భంగా కలినట్లు.. ఇద్దరం ఒకరినొకరం పరస్పరం పలకరించుకున్నట్లు.. అదే ఆఖరి చూపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.