ప్రముఖ గాయకుడు జి. ఆనంద్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆనంద్‌ హఠాన్మరణంతో సంగీత లోకమే కాదు, టాలీవుడ్‌ ప్రముఖులు సైతం దిగ్ర్భాంతికి గురయ్యారు. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్‌ సరైన సమయంలో అందకపోవడం ఆయన మృతిచెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన విచారం వ్యక్తం చేశారు. గాయకుడు ఆనంద్‌ తన తొలి పాట తన సినిమాకే పాడారని చెప్పారు చిరంజీవి.  `ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.. `అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరుదరహాసి జి.ఆనంద్‌ కర్కశమైన కరోనా బారిన పడి ఇకలేరని నమ్మలేకపోతున్నా. మొట్టమొదటిసారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పర్చింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నా` అని తెలిపారు చిరంజీవి. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

జి.ఆనంద్... ‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి సూపర్‌ హిట్‌ పాటలను ఆనంద్‌ పాడారు. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’, చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. ‘గాంధీనగర్‌ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే కొన్ని సీరియల్స్, డబ్బింగ్ చిత్రాలకూ సంగీత సారథ్యం వహించారు.   జి ఆనంద్ స్వస్థలం  శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. ప్రస్తుతం సినీ గాయనీ గాయకులుగా ఉన్న పలువురిని ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించారు.