విప్లవాత్మక భావజాలం కలిగిన నటుడు ఆర్ నారాయణ మూర్తి. ఆయన చిత్రాలు అదే తరహాలో ఉంటాయి. నారాయణ మూర్తి నటించిన తాజా చిత్రం 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. ఈ చిత్రం ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కల్మషం లేని వ్యక్తి నారాయణ మూర్తి అని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 

తాను నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో తొలి సారి మేమిద్దరం కలుసుకున్నాం.నూతన్ ప్రసాద్ కి పేపర్ అందించే కుర్రాడిగా నారాయణమూర్తి నటించారు. పాండిబజార్ లో తరచుగా కలుసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం అని చిరు తెలిపారు. క్రమంగా మా మధ్య స్నేహం కూడా పెరిగింది అని చిరు వివరించారు. నారాయణ మూర్తి ఎంత ఎదిగినా ఇప్పటికి అలాగే ఉన్నారు. 

ఇన్నేళ్ల పాటు తాను నమ్ముకున్న కమ్యూనిజం భావజాలంతోనే సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ చిత్రాల్లో నటించాలనే కోరిక అందరికి ఉంటుంది. కానీ నారాయణ మూర్తికి కమర్షియల్ చిత్రాల్లో అద్భుతమైన అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. టెంపర్ లాంటి చిత్రంలో పాత్రని వద్దనుకున్నారంటే ఆయన కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు అని చిరు తెలిపారు. 

సినిమాలనే ప్రేమించి, సినిమాలనే పెళ్లి చేసుకున్న వ్యక్తి నారాయణమూర్తి.ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎంత వెతికినా దొరకరు అని చిరంజీవి నారాయణమూర్తిని ప్రశంసల్లో ముంచెత్తారు.