విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా విలన్‌గా, మెయిన్‌ లీడ్‌లో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హీరో ఇమేజ్‌కి అతీతంగా నటిస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. విజయ్‌సేతుపతికి తమిళంలోనే కాదు, తెలుగుతోపాటు భారత్‌లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్‌ ఉన్నారు. కానీ విదేశాల్లోనూ తనకు మించిన ఫాలోయింగ్‌ ఉందని చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన `ఉప్పెన` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరు. 

`ఉప్పెన` కథ విని చిరు షాక్‌ అయ్యారట. దర్శకుడు బుచ్చిబాబు అద్భుతమైన కథని వినిపించారని, మన మట్టి కథ అని, ఇలాంటి రస్టిక్‌ చిత్రాలు రావాలని చెప్పారు. భారతీరాజా రూపొందించే సినిమాల తరహాలో `ఉప్పెన` సినిమా అద్భుతమైన ప్రేమ కథ అని చెప్పారు. ఇదొక సంచలన విజయం సాధిస్తుందన్నారు. ఇప్పుడు మనవైన మట్టి కథలురావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బుచ్చబాబుకి, అలాగే హీరో వైష్ణవ్‌ తేజ్‌కి, హీరోయిన్‌ కృతి శెట్టికి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు.

ఇందులో విజయ్‌ సేతుపతిపై ప్రశంసలు కురిపించారు చిరు. అద్భుతమైన నటుడని, ఆయన డేట్స్ దొరకడం, ఈ సినిమాలో ఆయన నటించడం ఈ సినిమా మొదటి సక్సెస్‌ అని చెప్పాడు. మరోవైపు  తాను అడగ్గానే `సైరా`లో నటించాడని చెప్పాడు. అయితే జార్జియాలో ఆ సినిమా షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని చిరంజీవి ఈ సందర్భంగా షేర్‌ చేసుకున్నారు. అక్కడ చిత్రీకరణ సమయంలో తాము ఉండే హోటల్‌కి భారీగా అభిమానులు వచ్చారట. హోటల్‌ సమీపం మొత్తం అభిమానులతో నిండిపోయిందని, బాగా కేకలు పెడుతున్నారని తనకు తెలిసిందట. తన అభిమానులేమో అని చిరంజీవి కంగారు పడ్డారట. 

దీంతో హుటాహుటిన హోటల్‌ నుంచి బయటకు రాగానే విజయ్‌ సేతుపతి పేరుతో నినాదాలు చేస్తున్నారట. జార్జియాలో ఆయనకు ఇంత ఫాలోయింగ్‌ ఉందా? అని చూసి చిరంజీవి షాక్‌ అయ్యారట. తన కోసం వచ్చేరేమో అని ముందు అనుకున్నా, అది తన కోసం కాదు విజయ్‌ సేతుపతి కోసం వచ్చారని తెలిసి అవాక్కయ్యారని, అదే సమయంలో తనకు ఆ గొడవ లేదని కాస్త రిలీఫ్‌ అయ్యానని చెప్పారు చిరు. మరోవైపు ఇటీవల `మాస్టర్‌` చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించారు. అందులో విజయ్‌ కంటే విజయ్‌ సేతుపతి పాత్రే బాగా నచ్చిందని చెప్పారు. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. 

విజయ్‌ సేతుపతి ప్రస్తుతం తెలుగులో `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. నెగటిల్‌ రోల్‌ అని చెప్పొచ్చు. సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.  ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.